Monday, July 23, 2018

వ్యామోహం

వలపు సందులలో ప్రతి మలుపు
తిరిగా వింటూ నే నీ పిలుపు

బస్సు స్టాపులో, నిద్ర మత్తులో తూగుతున్న  నాకు
వీధి చివర నుంచి ఉద్భవిస్తున్న నీ ఆకారమే సూర్యోదయం

వర్కుప్లేసులో, ఎడారి దారిలో ఒంటెలా శ్రమిస్తున్న నాకు
ఆప్పుడప్పుడు కంటపడే నీ చిరు హాస్యమే ఎండమావి

కెఫెటేరియాలో నువ్వు ముచ్చట్లు వేస్తుంటే,
చాటుగా కూర్చుని నీ తీపి మాటలు తింటుంటాను

కాఫీ బ్రేక్ లో నువ్వు ఛాయ్ తాగుతుంటే,
నా సాసర్ టీలో నీ సుందర బింబాన్ని తాగుతుంటాను 

రేయంతా మంచంపై ఒరిగి, రాసి నలిపేసిన  ప్రేమలేఖలే
ఉదయానికి మల్లె పూలై నీ పరిమళాన్ని వెదజల్లవా

రోజంతా అలల ఒడ్డున నడుస్తూ, కనులు తెరిచి కన్న కలలే
రాత్రి కళ్ళు మూయగానే, వాస్తవాలై జీవించవా

మళ్ళీ అదే బస్సు స్టాపులో, నిద్ర మత్తులో తూగుతున్న  నేను
పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడికై ఎదురు చూసినట్టు, నీ రాకకై వేచి ఉన్న నేను

అదిగో దేవతలా నా వైపే వస్తున్నావు, ఇది నిజమేనా
వెలిగే చిరునవ్వుతో నా వైపే చూస్తున్నావు, ఇది వరమేనా
నా చేయి పట్టి నన్ను లాక్కెళుతున్నావెక్కడ, స్వర్గానికేనా 
ఇది కలేమో, రెప్పలు వాలిస్తే చెదిరిపోతుందేమోనని గుడ్లప్పగించి చూస్తున్నా 

నీ చేయి పట్టి నడుస్తుంటే, ఈ మురికి వీధి కూడా రాజ మార్గం అనిపించదా
ఆ పాడుబడ్డ బంగళా కూడా,  పిచ్చాసుపత్రి ... పిచ్చాసుపత్రి!

కోమలమైన చేతి  స్పర్శ, ఉక్కు పట్టులా మారిందేం!
బంగారు వస్త్రాల్లో దేవత బదులు,  తెల్ల దుస్తుల్లో రాక్షసుడున్నాడేం!


వెళ్లనివ్వండి నన్ను. కళ్ళు మూసినా చెదరదే ఈ పీడ కల!
సంకెళ్లలో బంధించి సూదులు గుచ్చుతారే, ఇది నరకమా!

హ హా!  మసకబారుతోంది ప్రపంచం, చెదురుతుంది కల
మళ్ళీ మేలుకొంటా నే రాసిన ప్రేమలేఖల నడుమ ... 
... 
... 
ఉదయానికి మల్లె పూలై నీ పరిమళాన్ని వెదజల్లవా
ఒంటెలా శ్రమిస్తున్న నాకు.. కంటపడే నీ చిరు హాస్యమే ఎండమావి
కెఫెటేరియాలో..  చాటుగా కూర్చుని నీ తీపి మాటలు తింటుంటాను
కాఫీ బ్రేక్ లో..  నా సాసర్ టీలో నీ సుందర బింబాన్ని తాగుతుంటాను !


No comments:

Post a Comment